స్థానికతపై హైకోర్టు సంచలన తీర్పు

September 06, 2024


img

తెలంగాణలో డెంటల్, మెడికల్ కాలేజీలలో సీట్ల కేటాయింపులో స్థానిక కోటాపై గురువారం హైకోర్టులో సుదీర్గంగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ రాష్ట్రంలో శాశ్వితంగా నివాసం ఉంటున్నవారందరినీ స్థానికులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. 

విద్య, ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం లభించాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం చట్టంలో 3 (ఏ) సవరణ చేసేందుకు జీవో: 33 జారీచేసిందని అర్దమవుతోందని అంది. కానీ దానిని న్యాయస్థానం రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరదని, అప్పుడు దేశంలో ఉన్నవారందరూ 85 శాతం స్థానిక కోటాలో డెంటల్, మెడికల్ సీట్లు పొందగలుగుతారని, కనుక దానిని రద్దు చేయడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. 

స్థానికత చట్టంలో 3(ఏ)ని రద్దు చేయకపోయినా, ఆ కోటాలో డెంటల్, మెడికల్ సీట్ల అర్హత కోసం వరుసగా నాలుగేళ్ళు రాష్ట్రంలోనే చదివి ఉండాలనే షరతులు ఆమోదయోగ్యంగా లేవు కనుక వాటిని వర్తింపజేయరాదని హైకోర్టు తీర్పు చెప్పింది. 

తెలంగాణలో శాశ్విత నివాసం ఉంటున్నవారి పిల్లలు మెరుగైన శిక్షణ కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలలో చదువుకుంటే, అదే వారికి ప్రతిబంధకంగా మారకూడదని హైకోర్టు అభిప్రాయపడింది. వారు స్థానికులా కాదా? అనే చూడాలి తప్ప వారు ఇంటర్ తర్వాత రాష్ట్రంలోనే చదివుకున్నారా లేదా? అని కాదని హైకోర్టు స్పష్టం చేసింది. 

స్థానికత విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఏవీ లేవని కనుక ప్రభుత్వం వాటిని రూపొందించి అమలుచేయాలని హైకోర్టు సూచించింది.


Related Post