పాడి కౌశిక్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?

September 05, 2024


img

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం నా ఫోన్‌ ట్యాపింగ్ చేయిస్తోంది. ఖమ్మం జిల్లా సీపీ, ఇంకా పలువురు పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తోంది. ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా దారుణం,” అని అన్నారు.

పాడి కౌశిక్ రెడ్డి తాను సంచలన విషయం బయటపెట్టానని అనుకొని ఉండవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్‌ గురించి మాట్లాడి మళ్ళీ ఆ కేసులని అందరికీ గుర్తుచేశాననే విషయం మరిచారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులలో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు మాజీ సిఎం కేసీఆర్‌ ఆదేశం మేరకే అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసేవారిమని చెప్పారు.

ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్ళి 7-8 నెలలు అవుతోంది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. కనుక ఆయన హైదరాబాద్‌ తిరిగివస్తే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్‌ కేసు డొంక కదులుతుంది. అప్పుడు కేసీఆర్‌కి నోటీసులు పంపినా ఆశ్చర్యం లేదు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ అక్కడే ప్రభాకర్ రావుని కలిసి మాట్లాడబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఇటువంటి సమయంలో పాడి కౌశిక్ రెడ్డి, ఫోన్ ట్యాపింగ్‌ గురించి మాట్లాడటం రాజకీయంగా పొరపాటే. దాని వలన కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఇది బ్యాక్ ఫైర్ అయితే ఆయనపై వేటు పడినా పడవచ్చు.


Related Post