హైడ్రా పేరుతో వసూళ్ళా... అయితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి!

September 04, 2024


img

హైడ్రా సంస్థ నగరంలో పలు ప్రాంతాలలో అధికార, విపక్ష, సినీ, పారిశ్రామిక తదితరులకు చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండటంతో, కొందరు కేటుగాళ్ళు దీనినీ ఓ అవకాశంగా పసిగట్టి నగరంలో వెంచర్స్ వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సొంత ఇళ్ళు కట్టుకుంటున్న ప్రజలని ఇళ్ళు కూల్పించేస్తామంటూ బెదిరించి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలో సాయి విలాస్ రోడ్డులో జూబ్లీహిల్స్‌కి చెందిన వి రాజేంద్రనాధ్, మంజూనాధ్ రెడ్డి అనే ఇద్దరు బిల్డర్లు కలిసి ఎంసీఆర్వో ప్రాజెక్ట్ పేరుతో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా కన్ను వారి అపార్ట్‌మెంట్‌పై పడింది. వారికి రోజూ ఫోన్‌ చేస్తూ వారి అపార్ట్‌మెంట్‌ పెద్దచెరువు నాలా బఫర్ జోన్‌లో ఉందని, కనుక దానిని కూల్చివేయిస్తానని బెదిరించసాగాడు.

హైడ్రా కమీషనర్‌ రంగనాధ్ తో తనకు మంచి పరిచయం ఉందని 25 లక్షలు ఇస్తే వారి అపార్ట్‌మెంట్‌ జోలికి హైడ్రా రాకుండా చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అశోక్ నగర్‌ వద్ద గల పిస్తా హౌస్ వద్ద తాను అడిగిన డబ్బు చెల్లించాలని డాక్టర్ విప్లవ్ ఒత్తిడి చేశాడు.

ఈ వేధింపులు భరించలేక బిల్డర్లు అతనిపై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. 

దీనిపై హైడ్రా కమీషనర్‌ రంగనాధ్ స్పందిస్తూ, “హైడ్రా పేరుతో ఎవరు బెదిరిస్తున్నా, వసూళ్ళకి పాల్పడుతున్న ఎవరూ ఉపేక్షించవద్దు. తక్షణం మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేయండి.

ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ పరిధిలో లేని భవనాల జోలికి హైడ్రా వెళ్ళదు. నిబంధనలకు విరుద్దంగా చెరువులు, కాలువల బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తాము. కనుక వాటి పరిధిలో లేనప్పుడు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని స్పష్టం చేశారు.


Related Post