ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ వరద రాజకీయాలు!

September 03, 2024


img

ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఇక్కడ తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, అక్కడ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ముంపు ప్రాంతాలలో పర్యటించి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో బాధ్యతగా సంయమనంతో మెలగాల్సిన వైసీపి, బిఆర్ఎస్ పార్టీలు వరద రాజకీయాలు చేస్తుండటం చాలా శోచనీయం. 

ఇక్కడ కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, అక్కడ ఏపీలో మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరద రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ వరద ముప్పుని ఎదుర్కోవడంలో, బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదన్నట్లు మాట్లాడుతున్నారు. 

గత ఏడాది, అంతకు ముందు హైదరాబాద్‌ వరద నీటిలో మునిగిపోతే కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి అడుగుబయటపెట్టలేదు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు నీట మునిగితే, పంట నష్టం పరిశీలించలేదు.  కేసీఆర్‌ రైతులను పరామర్శించలేదు. 

లోక్‌సభ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కేసీఆర్‌ ఏసీ బస్సులో వెళ్ళి రైతులని పరామర్శించారు. కానీ ఇప్పుడు వరదలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావడం లేదు. ఆయన ఫామ్‌హౌస్‌లో లేరు అమెరికాలో ఉన్నారని సిఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు.

పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితులను పట్టించుకొని బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు తెలంగాణ భవన్‌లో కూర్చొని ముంపు ప్రాంతాలలో పర్యటించి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులని విమర్శిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏపీలో జగన్‌ కూడా ఇదేవిదంగా వ్యవహరిస్తున్నారు.


Related Post