సిఎం రేవంత్ రెడ్డి మనసులో ఏ ఆలోచన లేదా వ్యూహం ఉందో తెలీదు కానీ హైదరాబాద్ నగరాన్ని హైడ్రా చేతికి అప్పగించేశారు. అది నగరంలో పెద్దల అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేస్తుంటే తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్రా ప్రజలు సైతం రేవంత్ రెడ్డి సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
అయితే అంతా చట్టప్రకారం, నియమ నిబంధనల ప్రకారమే సాగుతుండటంతో బాధితులు, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఎవరూ కోర్టులకు వెళ్ళడం లేదు. ఈ కూల్చివేతలు, బాధితులు, బిఆర్ఎస్ మౌనం రెండూ కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
పంట రుణాలు మాఫీ విషయంలో కొన్ని ప్రశంశలు, కొన్ని విమర్శలు ఎదుర్కొన్న సిఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కూల్చేవేతలతో కూడా కొన్ని ప్రశంశలు, కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరుతో గొలుసు కట్టు చెరువులను పునరుద్దరించింది. చెరువులు కాపాడుకోవడం చాలా అవసరమంటూ అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు వ్రాసిన ఓ పెద్ద వ్యాసం ఆయన ఫోటో సహ ఓ పత్రికలో ప్రచురించబడింది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమణల నుంచి విడిపిస్తుంటే గట్టిగా తప్పుపట్టలేకపోతున్నారు.
కానీ సామాన్య ప్రజలు ముఖ్యంగా ముంపు బాధితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధిస్తున్నారు. చెరువులని, కాలువలని విడిపించి మళ్ళీ వరద నీటికి దారి చూపిస్తున్నారని హర్షిస్తున్నారు. బహుశః బిఆర్ఎస్ పార్టీ మౌనానికి ఇదీ ఓ కారణం అయ్యుండవచ్చు.
ఓ పక్క కూల్చివేతలు కొనసాగుతుండగానే మరో పక్క ఇప్పుడు నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలను అనుమతించిన అధికారులపై ప్రభుత్వం వేటు వేస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆరుగురుపై కేసులు నమోదు చేయగా మరో 50 మంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం అపరచితుడు, భారతీయుడు, ఒకే ఒక్కడూ వంటి సినిమాలలో మాత్రమే చూడగలిగినవి రేవంత్ రెడ్డి నిజ జీవితంలో చేసి చూపిస్తుంటే, సామాన్య ప్రజలదృష్టిలో ఆయన రోజురోజుకీ హీరోగా ఎదిగేలా చేస్తోంది.
అయితే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఉద్యోగులలో రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది కూడా. అలాగే ఈ కూల్చివేతలు, అధికారులపై చర్యలతో రేవంత్ రెడ్డికి ఇంటా బయటా శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇకపై మరింత అప్రమత్తంగా ముందుకు సాగడం చాలా అవసరం.