శ్రీశైలం తీగ లాగితే డొంక కదిలింది... ఇన్ని తప్పులా!

August 31, 2024


img

సరిగ్గా నాలుగేళ్ళ క్రితం అంటే 2020, ఆగస్ట్ 20వ తేదీ రాత్రి శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దానిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవార్త అప్పుడు అన్ని పత్రికలలో ప్రధానవార్తగా వచ్చింది.

దానిపై విచారణ జరిపేందుకు అప్పటి బిఆర్ఎస్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అంతే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు, ప్రమాదం గురించి మరెన్నడూ ఏదీ బయటకు రాలేదు. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. 

విద్యుత్ ఉత్పత్తి, సమస్యలపై ఇటీవల సిఎం రేవంత్‌ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు ఆ 4వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదనే విషయం బయటపెట్టారు అధికారులు.

కారణం అడిగితే ఆనాడు జరిగిన అగ్నిప్రమాదం గురించి చెప్పి, రూ.50 కోట్లతో కాలిన ఆ యూనిట్‌కి మరమత్తులు చేయించినా పనిచేయడం లేదని, మళ్ళీ మరమత్తుల కోసం రూ.30కోట్లతో టెండర్లు పిలిచామనే విషయం బయటపెట్టారు.

ఈవిదంగా అధికారులు ఒకటొకటే జరిగిన తప్పులు బయటపెడుతుండటంతో ఆనాడు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, నివేదిక గురించి సిఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు.

అది అప్పుడే సిద్దం అయ్యిందని కానీ అప్పటి ప్రభుత్వమే దానిని పక్కన పెట్టేసిందని అధికారులు చెప్పడంతో సిఎం రేవంత్‌ రెడ్డి మరోసారి షాక్ అయ్యారు. వెంటనే ఆ నివేదిక తెప్పించుకొని పరిశీలించగా దానిలో ఇంకా దిగ్బ్రాంతి కలిగించే విషయాలున్నాయి. 

• ఈ విద్యుత్ ప్రమాదం 4వ యూనిట్‌లో బ్యాటరీ మార్చుతుండగా జరిగింది. సాధారణంగా వేసవిలో విద్యుత్ ఉత్పత్తి చేయని 8 నెలల్లో ప్లాంట్లో ఇటువంటి మరమత్తు పనులు చేతుంటారు. కానీ ఆరోజు విద్యుత్ ఉత్పతి జరుగుతుండగా చేయడంతో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 

• ఆ సమయంలో కొంతసేపు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి మరమత్తులు చేసినా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా మరమత్తులు చేశారు. 

• బ్యాటరీ మార్చుతున్నప్పుడు తప్పనిసరిగా ప్లాంట్ చీఫ్ ఇంజనీర్లు సురేష్, ప్రభాకర్ రావు అక్కడ ఉండి పర్యవేక్షించాలి. కానీ వారిరువురూ లేరు. ప్లాంట్ మరమత్తులు చేసే గుత్తేదారు (ప్రైవేట్ కంపెనీ) సిబ్బందికి ఆ పని పురమాయించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. 

• శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనిచేస్తున్నప్పుడు దానిని పర్యవేక్షించాల్సిన డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ ఇద్దరూ కూడా పట్టించుకోలేదు. 

• ఈ నలుగురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవలసిందిగా నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం, జెన్‌కో రెండూ కూడా పట్టించుకోలేదు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.           

• శ్రీశైలం 4వ యూనిట్‌లో వర్షాకాలంలో రోజుకి 35 లక్షల యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ఆ లెక్కన ఈ నాలుగేళ్ళలో 168 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా అది నిలిచిపోయింది. 

• ఇంత విద్యుత్ లోటు ఏర్పడటంతో విద్యుత్ సంస్థలు బయత్ మార్కెట్ నుంచి యూనిట్‌కి రూ.5 చొప్పున చెల్లించి కొంటున్నాయి. ప్రాణ నష్టం, దానికి ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం కాకుండా కేవలం ఈ రెండూ కలిపి లెక్కిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.840 కోట్లు నష్టం వాటిల్లింది అని నివేదికలో పేర్కొన్నారు.


Related Post