బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అంటే 2015లో ఓటుకి నోటు కేసు జరిగింది. ఆ తర్వాత మరో 8 ఏళ్ళు అధికారంలో ఉంది. అప్పుడు ఆ కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో వేసి చాలా హడావుడి చేసిన కేసీఆర్ ఆ తర్వాత చల్లబడిపోయారు. ఆ కేసుని అటకెక్కించేశారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దానిని బయటకు తీసి రేవంత్ రెడ్డిపై రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి సిద్దపడటం విశేషం.
ప్రస్తుతం తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆ కేసు విచారణని మధ్యప్రదేశ్‌కి బదిలీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేత పిటిషన్ వేయించారు. దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు జగదీష్ రెడ్డికి, ముఖ్యంగా కేసీఆర్‌కి చెంపదెబ్బ వంటివే అని చెప్పక తప్పదు.
జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే… ఇది 2015లో జరిగితే ఇన్నేళ్ళ తర్వాత, ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? అప్పుడే ఎందుకు రాలేదు? మీకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోవచ్చునేమో కానీ మాకు పూర్తి నమ్మకముంది.
ఈ కేసులో నిందితుడు ముఖ్యమంత్రి అయితే ఆయన న్యాయవ్యవస్థని ప్రభావితం చేస్తారని ఎలా అనుకుంటున్నారు?
ఊహాజనితమైన ఇటువంటి పిటిషన్లను అంగీకరించి ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు కూడా నమ్మకం పోతుంది కదా?కనుక నిష్పక్షపాతంగా విచారణ జరిపించేందుకు , తెలంగాణ హైకోర్టులో మా సహచరులతో మాట్లాడి స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ని నియమిస్తాం,” అని అన్నారు.
ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసుని కదపాలనుకోవడం, బీజేపీ అధికారంలో ఉన్న మద్య ప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని బిఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కోరడం రెండూ కూడా రాజకీయ దురుదేశ్యంతో కూడినవే అని అర్దమవుతోంది.
అయితే సిఎం రేవంత్ రెడ్డి సంయమనాన్ని బిఆర్ఎస్ పార్టీ అలుసుగా తీసుకుంటున్నట్లుంది. ఈ పిటిషన్ ఇందుకు తాజా నిదర్శనంహా భావించవచ్చు. కనుక రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి చేజేతులా సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకో అర్ధం కాదు.