జహీరాబాద్‌లో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్

August 29, 2024


img

 ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలోలో రూ.2,361 కోట్లు వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా జహీరాబాద్‌లో న్యాలకల్, ఝురాసంగం మండలాలోని 17 గ్రామాలలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. 

రెండు దశలలో 12,500 ఎకరాలలో ఈ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తారు. అయితే మొదటి దశకు అవసరమైన 3,425 ఎకరాలలో 3,100 ఎకరాలు ప్రభుత్వ భూములు సిద్దంగా ఉన్నందున రైతులు పెద్దగా నష్టపోరు. 

జాతీయ రహదారి 65కి సమీపంలో ఉండటం, జహీరాబాద్‌లోని మెటల్ కుంట రైల్వే స్టేషన్‌, హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్‌, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయంకి సమీపంలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 

 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోబైల్, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, యంత్రాల తయారీ తదితర పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. వీటి ద్వారా సుమారు 1.74 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రెండో దశ కూడా పూర్తయితే రాష్ట్రంలో మరో పెద్ద నగరంగా జహీరాబాద్ మారుతుంది.                      

దీనికి అవసరమైన పర్యావరణ అనుమతులన్నీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని ఏర్పాటు కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఇప్పటికే ఒప్పంద పత్రాలు కూడా సిద్దం అయ్యాయి. 

ఇది కాక తెలంగాణ రాష్ట్రంలో మరో 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్‌, మంచిర్యాల, నల్గొండ, రామగుండం, సూర్యాపేటలో చెరో మూడు, నిజామాబాద్‌ జిల్లాలో 4 ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి.


Related Post