గోషామహల్‌కి తరలనున్న ఉస్మానియా హాస్పిటల్‌

August 28, 2024


img

శిధిలావస్థకు చేరుకుంటున్న ఉస్మానియా హాస్పిటల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం శాశ్విత పరిష్కారం చూపుతోంది. ఆ భవనాలు కూల్చి కొత్తవి నిర్మించేందుకు న్యాయ వివాదాలు అవరోదంగా మారడంతో వాటిని అలాగే ఉంచి గోషామహల్‌లో పోలీస్ శాఖకు చెందిన 32 ఎకరాలలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదనకు సిఎం రేవంత్‌ రెడ్డి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. 

రాబోయే 50 ఏళ్ళలో పెరిగే జనాభా, రోగులు, ట్రాఫిక్ వంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ ఉస్మానియా హాస్పిటల్‌ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. 

హాస్పిటల్‌కు అనుబందంగా నర్సింగ్ కళాశాల, హాస్టల్స్, వైద్యులకు నివాస సముదాయం వగైరాలు నిర్మించాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. వీటి ప్లాన్ మరియు డిజైనింగ్ కోసం అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. 

ఉస్మానియా హాస్పిటల్‌ నూతన భవన సముదాయం నిర్మాణ పనులని నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలని అందుకు తగ్గట్లుగా వివిద శాఖల మంత్రులు, కార్యదర్శులు, అధికారులు సమన్వయం చేసుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. 

ప్రస్తుతం గోషామహల్‌లో ఉన్న పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెంటినీ అక్కడి నుంచి పేట్లబురుజు వద్ద గల పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీలు ఉన్న ప్రాంతానికి తరలించడానికి గల అవకాశాలను పరిశీలించాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తద్వారా పోలీస్ శాఖకి చెందిన అన్ని ప్రధాన కార్యాలయాలు ఒక్కచోట ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు.  


Related Post