హైడ్రా కూల్చివేతలపై అన్ని పార్టీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతల నుంచి సిఎం రేవంత్ రెడ్డికి అనూహ్య మద్దతు లభిస్తుండటం విశేషం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ కూల్చివేతలపై స్పందిస్తూ ఎవరైనా ఆక్రమణల తొలగింపుకి అడ్డుపడితే వారిపైకి బుల్డోజర్లు నడపండి కానీ ఆక్రమణదారులని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించవద్దు. చెరువులను, కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారుల నుంచి విడిపిస్తున్నందుకు సిఎం రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను,” అని అన్నారు.
బీజేపీ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డిగారు మీరు చాలా ధైర్యంగా చాలా మంచి పనిచేస్తున్నారు. కనుక ఓవైసీల బెదిరింపులకి భయపడి వెనక్కు తగ్గొద్దు. ఓవైసీలు పేద పిల్లలకు ఉచిత విద్య పేరిట విద్యా వ్యాపారం చేస్తున్నారు.
బండ్లగూడలో సల్కం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా కాలేజీ పేరుతో 12 భవనాలు నిర్మించుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆనాడు మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యంగా ఓవైసీని జైల్లో వేశారు. కానీ తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ముస్లిం ఓట్ల కోసం ఓవైసీ కబ్జాలను చూసీ చూడన్నట్లు ఊరుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మీరు (రేవంత్ రెడ్డి) ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. కనుక ధైర్యంగా ముందుకు సాగండి. మీ వెనుక మేముంటాము,” అని అన్నారు.