ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేడు సుప్రీంకోర్టు సుదీర్గంగా ఆమె బెయిల్ విచారణపై ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి.
అవి విన్న తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఈడీ, సీబీఐలు విచారణ పూర్తిచేసి చార్జ్ షీట్స్ దాఖలు చేసినందున ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో 5 నెలలుగా ఢిల్లీ, తిహార్ జైలు నుంచి నేడు కల్వకుంట్ల కవితకు విముక్తి లభించింది.
కల్వకుంట్ల కవితకి బెయిల్ లభించడంతో అప్పుడే కేసీఆర్ కుటుంబంలో మిటాయిలు పంచుకొని సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా టపాసులు పేల్చి, మిటాయిలు పంచుతూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కూతురు కవిత కోసం తల్లడిల్లుతూ ఫామ్‌హౌస్‌లో ఉండిపోయి రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం, దాంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయమనే భావించవచ్చు. ముఖ్యంగా కవిత బెయిల్ కోసం బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య ఏదైనా రహస్య అవగాహన కుదిరి ఉంటే, అది కూడా త్వరలో బయటపడుతుంది.