ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 5 నెలలుగా బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ ఏవీ ఫలించలేదు. చిట్ట చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే వారం రోజుల క్రితం ఈ కేసు విచారణ జరిపి నేటికీ వాయిదా వేస్తున్నప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీబీఐ, ఈడీ ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని గట్టిగా వాదిస్తున్నాయి. కనుక ఈ నేపధ్యంలో ఆమెకు ఇవాళ్ళైన బెయిల్ లభిస్తుందా లేదా? అనే విషయం మరికొన్ని గంటలలో తేలిపోతుంది.
కేటీఆర్, హరీష్ రావులతో సహా పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు ఢిల్లీకి వెళ్ళారు. ఈరోజు తప్పకుండా ఆమెకు బెయిల్ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ బెయిల్ లభిస్తే వారు ఆమెను తోడ్కొని హైదరాబాద్ తీసుకు వస్తారు.
కూతురు కవిత గురించి దిగులుతోనే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావడం మానేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక ఒకవేళ నేడు కల్వకుంట్ల కవితకి బెయిల్ లభిస్తే ఇక నుంచి కేసీఆర్ రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. కనుక బెయిల్ లభిస్తే ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై తప్పక ఉంటుంది.