మా భవనాల జోలికి వస్తే ఊరుకోము: ఓవైసీ

August 27, 2024


img

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఇప్పటి వరకు నగరంలో సుమారు 100కిపైగా అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

తర్వాత కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఓవైసీలు నిర్మించుకున్న అక్రమ కట్టడాలు కూల్చివేయబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై మజ్లీస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. 

నగరంలో పలు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయని వాటన్నిటినీ కూడా కూల్చేస్తారా? అని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. తమ భవనాల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు.

ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, “పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సదుదేశ్యంతో మేము 12 భవనాలు నిర్మించాము. నాపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలంటే తీర్చుకోండి. కావాలంటే నన్ను కాల్చి చంపండి. కానీ వాటిని కూల్చివేయాలనే ఆలోచన కూడా చేయొద్దు. మా భవనాల జోలికి వస్తే సహించము. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది,” అని హెచ్చరించారు.

ఓవైసీలు తమ ఈ వాదనలతో తమవి అక్రమ కట్టడాలని స్వయంగా అంగీకరించిన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వ భవనాలే నిబంధనలకు విరుద్దంగా నిర్మించబడాయి కనుక తాము చేసింది తప్పు కాదని సమర్ధించుకున్నట్లు అర్దమవుతోంది.

అయితే ప్రభుత్వం ఓవైసీలకు భయపడి ఇప్పుడు వెనక్కు తగ్గితే, ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసిన 100కి పైగా భవనాల యజమానులు అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉంటారా? తాము ప్రభుత్వాన్ని ఎదుర్కొలేనందునే అలుసుగా భావించి కూల్చివేశారని, ఈవిదంగా బ్లాక్ మెయిల్ చేసే వారి జోలికి వెళ్ళడానికి  భయపడుతుందని వాదించకుండా ఉంటారా? హైకోర్టు ఇదే ప్రశ్న వేస్తే ప్రభుత్వం  జవాబు చెప్పగలదా?


Related Post