బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజాసమస్యలపై నుంచి అందరి దృష్టిని మళ్ళించేందుకే హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతోంది. అయితే ఇలా ఎంతకాలం ప్రజలని మభ్యపెట్టగలదు?
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించాలని ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనని టార్గెట్‌గా చేసుకొని హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తోంది.
బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఈవిదంగా వేధింపులకు పాల్పడుతోంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నది ఇందుకేనా?పరిపాలన, ఎన్నికల హామీలు అమలు, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టదా?” అని హరీష్ రావు ప్రశ్నించారు.
అయితే తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి నాగార్జున నిర్మించుకున్న ‘ఎన్ కన్వెన్షన్ సెంటర్’ కూల్చివేతపై ఎవరూ నాగార్జునని సమర్ధిస్తూ మాట్లాడలేదు. హైడ్రాని తప్పు పట్టలేదు. సామాన్య ప్రజలు, నెటిజన్స్ ప్రశంశిస్తున్నారు కూడా.
కనుక భూకబ్జాలు చేసినవారు ఎ పార్టీ, కులం, మతంవారైనా హైడ్రా బుల్డోజర్స్ వారి అక్రమ కట్టడాలను కూల్చివేయక మానదు. అప్పుడు బిఆర్ఎస్ నేతలు కూడా హైడ్రాని తప్పు పడితే నాగార్జునలాగే అప్రదిష్టపాలయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక హైడ్రా విషయంలో బిఆర్ఎస్ నేతలు కూడా కాస్త ఆచితూచి స్పందిస్తే వారికే మంచిది.