మహాలక్ష్మి పధకంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కొందరు మహిళలు అందరి దృష్టిని ఆకర్షించడానికో మరి దేనికో తెలీదు కానీ బస్సులలో బ్రష్ చేసుకోవడం, కూరగాయలు తరుక్కోవడం వంటి పనులు చేస్తున్నారు. అయితే అలా చేయకూడదనే నిబంధన ఏమీ లేదు కనుక ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
ఆ మహిళలని చూసిన ఇతర ప్రయాణికులు కూడా ఏదో ఓ అభిప్రాయం వ్యక్తం చేసే ఉంటారు. కానీ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నాయకుడు అయినందున ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ మొదలైంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “ఆర్టీసీ బస్సులలో మహిళలు కూరగాయలు తరుక్కోమనండి... బ్రేక్ డ్యాన్స్ చేసుకోమనండి... ఒక్కో మహిళకి ఒక్కో బస్సు వేయండి. ఎవరు వద్దన్నారు?అంటూ కాస్త వెటకారంగా మాట్లాడారు.
దీనిపై వివరణ కోరుతూ రాష్ట్ర మహిళా కమీషన్ ఆయనకు నోటీస్ పంపించింది కూడా. అప్పుడు కేటీఆర్ మళ్ళీ స్పందిస్తూ, “నాకు అక్క చెల్లెమ్మలంటే చాలా గౌరవం. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఆ మాట అనలేదు. కానీ ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని కోరుతున్నాను. మహిళా కమీషన్ ఎదుట తప్పకుండా హాజరయ్యి ఇదే చెపుతాను,” అని అన్నారు.
నేడు మహిళా కమీషన్ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మహిళా కార్యకర్తలు అక్కడకు చేరుకొని కేటీఆర్ డౌన్ డౌన్ అని ఒకరు, కాంగ్రెస్ డౌన్ డౌన్ అని మరొకరు నినాదాలు చేస్తుండటం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మహిళా కమీషన్‌కు సంజాయిషీ ఇచ్చుకునేందుకు కేటీఆర్ వచ్చినప్పుడు పార్టీలో మహిళా కార్యకర్తలను అక్కడికి రప్పించడం సమంజసనీయమా? అలాగే ఆయన తప్పు ఒప్పుకొని సంజాయిషీ ఇచ్చుకుంటున్నప్పుడు కాంగ్రెస్ ఈ అతి చేయడం అవసరమా?
మహిళలపై వ్యాఖ్యలు చేసినందుకే ఆయన మహిళా కమీషన్ ఎదుట హాజరవుతుంటే రెండు పార్టీల మహిళలు గొడవ పడటం సమంజసంగా ఉందా?