యాదాద్రిలో బిఆర్ఎస్ రాజకీయ డ్రామా... అవసరమా?

August 22, 2024


img

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ నేతలు కలిసి నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ‘పంట రుణాలు మాఫీ చేస్తానని దేవుడిపై ఒట్టు వేసి మాట తప్పిన సిఎం రేవంత్‌ రెడ్డి కారణంగా తెలంగాణ రాష్ట్రం, ప్రజలపై ఆగ్రహం కలిగించవద్దని’ ఓ పంతులుగారు సంస్కృతంలో చెపుతుంటే హరీష్ రావు తదితరులు వాటిని వల్లె వేశారు.

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలకు నీతులు చెప్పిన హరీష్ రావు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఎందుకు? పంట రుణాలు మాఫీ గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే శాసనసభ సమావేశాలలో లేదా బయటో నిలదీయాలి. ఈ అంశంపై ప్రభుత్వంతో పోరాడాలనుకుంటే హైదరాబాద్‌లోనే పోరాడాలి. కానీ పరమ పవిత్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈవిదంగా రాజకీయాలు చేయడం సరికాదు.

పబ్లిసిటీ కోసం గల్లీ స్థాయి నేతలు ఇటువంటి చవుకబారు పనులు చేస్తే తప్పు పట్టలేము. కానీ హరీష్ రావు స్థాయికి ఇది తగదు. దీంతో సిఎం రేవంత్‌ రెడ్డిని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారని అర్దమవుతూనే ఉంది. కానీ అంతకంటే ముందు హరీష్ రావు ప్రతిష్ట మసకబారుతుందని చెప్పక తప్పదు.


Related Post