సచివాలయంలోనే తెలంగాణ తల్లి... కానీ ఏ తల్లి?

August 21, 2024


img

తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి దిగివచ్చిన్నట్లే ఉంది. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్‌ 9వ తేదీన రాష్ట్ర సచివాలయం ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 

అయితే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెపుతున్నారు. ఒకవేళ ఏర్పాటు చేస్తే దానిని తాము అధికారంలోకి రాగానే తొలగిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. 

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్దపడటంతో ప్రస్తుతానికి ఈ సమస్య కొలిక్కి వచ్చిన్నట్లే ఉంది. కానీ ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. 

కేసీఆర్‌ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం మొహంలో ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత పోలికలు కనిపిస్తున్నాయని, బంగారు ఆభరణాలతో రూపొందించిన ఆ విగ్రహం దొరల గడిని, రాజరిక పోకడలను సూచిస్తున్నట్లుందని రేవంత్‌ రెడ్డి ఇదివరకే ఆరోపించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలంగాణలో సాధారణ మహిళల రూపురేఖలతో నిరాడంబరంగా ఉన్న ఓ విగ్రహాన్ని రూపొందింపజేశారు కూడా. కానీ విగ్రహం మార్పుపై కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మాటకు తిరుగేలేదు. కనుక కేసీఆర్‌ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు ఆ కొత్త రూపురేఖలతో ఉన్న విగ్రహమే సచివాలయంలో ఆవిష్కరించవచ్చు. దానిని బిఆర్ఎస్ పార్టీ అంగీకరించకపోవచ్చు. కనుక తెలంగాణ తల్లి విగ్రహంపై మళ్ళీ కొత్త వివాదం అనివార్యంగానే కనిపిస్తోంది.


Related Post