ఇతర పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలను పార్టీలోకి తెచ్చుకోవాలంటే వారికి ముందుగానే ఏవో పదవులు లేదా హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వస్తారు.
గతంలో కాంగ్రెస్, టిడిపి నేతలను బిఆర్ఎస్‌లోకి రప్పించుకున్నప్పుడు కేసీఆర్ కూడా వారికి ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చారు. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఇటీవల బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ సలహాదారుడిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిదంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి కూడా నామినేటడ్ పదవి లభించింది. ఆయనను తెలంగాణ డెయిల్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం రెండేళ్ళని ఉత్తర్వులలో పేర్కొంది.
అయితే ఈ నామినేటడ్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు ఎదురుచూస్తుండగా, బిఆర్ఎస్ నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినవారికి పదవులు కట్టబెట్టడంతో వారు తీవ్ర అసంతృప్తి చెందడం సహజమే. కనుక త్వరలో వారికీ నామినేటడ్ పదవులు ఇవ్వక తప్పదు.