గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంటే దానిని రాష్ట్ర స్థాయిలో అడ్డుకునే బదులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తుండేవారు.
బహుశః తెలంగాణ బీజేపీ నేతలు ఎవరూ తన స్థాయికి తగినవారు కారని కావచ్చు లేదా తనది ప్రధానమంత్రి స్థాయి అని చెప్పుకోవడానికి కావచ్చు.
కానీ కేసీఆర్ ఎంచుకున్న ఆ విధానం బెడిసికొట్టడంతో ఆ ప్రభావం బిఆర్ఎస్ పార్టీపై పడి ఎన్నికలలో ఓడిపోయింది. కేసీఆర్ అధికారం కోల్పోయారు. ఆ అవమానం భరించలేక పార్టీని కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించేసి ఆయన ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు.
తండ్రి చేసిన పొరపాటే ఇప్పుడు కొడుకు కేటీఆర్ కూడా చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీని విమర్శిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
రాష్ట్రంలో రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి సగం మందికి కూడా ఇవ్వలేదని, కనుక మిగిలిన ఆ రైతుల తరపున మీకు లేఖ వ్రాస్తున్నానంటూ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు వ్రాశారు.
కేటీఆర్ కూడా తన తండ్రిలాగే ఆలోచిస్తూ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు తన స్థాయికి తగరని భావిస్తున్నారేమో? జాతీయ నాయకుల స్థాయి తనదని అను అనుకుంటున్నారేమో? లేకుంటే ఇటువంటి లేఖల వలన ఆయన సాధించేది ఏముంటుంది?
ఏమీ లేకపోయిన ఇది సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ఆగ్రహం, అసహనం కలిగిస్తాయి కనుక వారు ప్రతిచర్యలు (ఫిరాయింపులు) మొదలుపెడితే మళ్ళీ నష్టపోయేది బిఆర్ఎస్ పార్టీయే కదా?