గత నెల రోజులుగా బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. సిఎం రేవంత్ రెడ్డి కూడా విలీనం ఖాయమని చెప్పారు. కానీ ఇతర అంశాలపై గట్టిగా మాట్లాడుతున్న కేసీఆర్, హరీష్ రావులు ఈ విలీన వార్తలను మాత్రం ఖండించడం లేదు. కానీ ఎదురుదాడి చేసి అసలు విషయాన్ని దాట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో బిఆర్ఎస్ మౌనమే ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోందని చెప్పవచ్చు.
బీజేపీలో బిఆర్ఎస్ విలీనాన్ని కేటీఆర్, హరీష్ రావులు ఖండించకపోయినా బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం ఖండిస్తున్నారు. ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ, “ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌లను చీదరించుకొని బిఆర్ఎస్ పార్టీని గంగలో కలిపేశారు. అటువంటి పార్టీ మాకు అవసరం లేదు. దాని వలన మాకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు మొదలుపెట్టారు. కనుక దానిలోనే తన పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేయలేక తడబడుతోంది. అందుకే సిఎం రేవంత్ రెడ్డి ప్రజలను దృష్టి మళ్లించేందుకు ఈ విలీనం కబుర్లు మాట్లాడుతున్నారు,” అని అన్నారు.