స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న రాజ్‌భవన్‌లో అధికార, ప్రతిపక్షాలకు ఆనవాయితీ ప్రకారం ఎట్ హోమ్ తేనీటి విందు ఇచ్చారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డిజిపి జితేందర్, టీజీపీఎస్‌ఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఇంకా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పద్మ అవార్డు గ్రహీతలు, రామచంద్రా మిషన్ అధ్యక్షుడు దాజీ కమలేశ్ పటేల్ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.
ప్రతిపక్షాల నుంచి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు. గవర్నర్ దంపతులు విందుకు హాజరైన ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు.
అయితే కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అయిపోతున్నాయని వాదిస్తున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఈ విందుకు హాజరుకాలేదు.
గతంలో మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో కేసీఆర్‌కు పడదు కనుక హాజరుకాలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి విభేధాలు లేవు కదా?
కేసీఆర్ శాసనసభకు ఎలాగూ రావడం లేదు కనీసం గవర్నర్ ఇచ్చిన విందుకు హాజరుకావచ్చు కదా? గవర్నర్ ఆహ్వానిస్తే కేసీఆర్, కేటీఆర్ రాకపోవడాన్ని ఏమనుకోవాలి?