వైద్య విద్యకు విదేశాలకు వెళ్ళే దుస్థితి ఉండదు

August 15, 2024


img

నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ఎర్రకోట చేరుకొని జాతీయ జెండా ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ఇది 11వసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష ముఖ్యనేతలు, త్రివిధ ధళాధిపతులు, వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.   

జాతీయ పతాకావిష్కరణ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “శతాబ్ధాల తరబడి పరాయి పాలనలో మగ్గిన భారత్‌కి స్వాతంత్ర్యం సాధించేందుకు 40 కోట్ల మంది భారతీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారి పోరాటాల వలననే నేడు మనం స్వేచ్చా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాము. కనుక వారి పోరాటాలు, త్యాగాలను గౌరవిస్తూ 2047నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాము.

అంతరిక్ష రంగంలో ఇప్పటికే మనం చాలా అభివృద్ధి సాధించాము. కానీ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలి. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ త్వరలో భారీ సంస్కరణలు చేపట్టబోతున్నాము. మన విద్యార్దులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్ళే దుస్థితి ఇకపై ఉండకూడదు. దేశంలో భారీగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం. ప్రపంచ దేశాలకు భారత్‌ అన్నదాతగా నిలవాలి. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు భారత్‌ చిరుధాన్యాలు (మిల్లెట్స్) అందించగలగాలి. 

దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు దాటినప్పటికీ నేటికీ దేశంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై దాడులు జరుగుతుండటం చాలా బాధాకరం. వీటిని అరికట్టేందుకు చట్టాలను మరింత కటినం చేస్తాము. దేశం ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాము. 

మన నూతన పారిశ్రామీకరణ విధానం ద్వారా భారత్‌లో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. వాటి ద్వారా కోట్ల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి. కానీ ఈ అభివృద్ధి సరిపోదు. 2047నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాము,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 


Related Post