రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళయినా ఇంతవరకు రెండు రాష్ట్రాల మద్య పలు సమస్యలు పరిష్కారం కాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి మద్య రాజకీయ వైరం ఉంది కనుక పరిష్కారం కాలేదు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మద్య మంచి సఖ్యత ఉండేది. అయినా వారు విభజన సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. బహుశః వాటితో సెంటిమెంట్ రాజకీయాలు చేసుకునే వెసులుబాటు ఉన్నందునే వాటిని అపరిష్కృతంగా విడిచిపెట్టి ఉండవచ్చు.
కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన వెంటనే ఈ విభజన సమస్యలను పరిష్కరించుకోవాలనుకున్నారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ప్రజా భవన్‌లో కలిసి విభజన సమస్యలపై చర్చించారు. మూడు అంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
వాటిలో మొట్టమొదట ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 122 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులను డ్యూటీ నుంచి రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు వారిని రిలీవ్ చేస్తున్నట్లు దానిలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం వారికి సమాన క్యాడర్, జీతంతో సంబంధిత శాఖలలోకి తీసుకుంటుంది.
పదేళ్ళ తర్వాత ఒక విభజన సమస్య పరిష్కారమయ్యింది. మిగిలిన సమస్యలు కూడా ఇలాగే సామరస్యంగా పరిష్కరించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలుగుతుంది. రెండు రాష్ట్రాల మద్య సంబంధాలు మళ్ళీ బలపడే అవకాశం కూడా ఉంటుంది.