పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయిన భారత్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ రెజ్లర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రెషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిపై ఆమె తరపున ఇద్దరు సీనియర్ న్యాయవాదులు తమ వాదించారు. ఆమె పిటిషన్‌పై తీర్పు మరికొన్ని గంటలలో వెలువడనుంది.
మహిళల 50 కేజీల రెజిలింగ్ విభాగంలో కేవలం వంద గ్రాముల అధనపు బరువు ఉన్నందుకు అనర్హత వేటువేయడం సరికాదని వారు వాదించారు. ఆమె వరుసగా అనేక మందితో పోటీ పడేందుకు చాలా బలమైన ఆహారం తీసుకోవలసి ఉండగా, ఈ బరువు పరిమితి కోసం ఆమె ఆహారం, నీళ్ళు తీసుకోవడం మానుకొని బరువుని నియంత్రించుకుంటూనే ప్రీ- క్వార్టర్స్ నాలుగుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిఒన జపాన్ రెజ్లర్ సుసాకిని సైతం ఓడించారని వారు వాదించారు.
ఆమెకు మరికొద్ది నిమిషాలు సమయం ఇచ్చి ఉంటే అదనపు బరువుని కూడా తగ్గించుకుని ఉండేవారని కానీ సమయం ఇవ్వకుండా ఆమె వాదనలు వినకుండానే అనర్హత వేటు వేశారని వారు వాదించారు. అయినా ఈ 100 గ్రాముల అదనపు బరువుతో ఆమెకు ఎటువంటి అదనపు ప్రయోజనం ఉండదని కానీ ఫైనల్స్‌లో ఆడనిచ్చి ఉంటే ఖచ్చితంగా భారత్‌కు పతకం సాధించి ఉండేవారని వాదించారు.
వారి వాదనలను సావధానంగా విన్న కాస్ మరికొన్ని గంటలలో తీర్పు చెప్పనుంది. ఒకవేళ సానుకూలంగా వస్తే ఆమెకు రజత పతకం లభిస్తుంది. లేకుంటే ఒట్టి చేతులతో నిరాశగా వెనక్కు తిరిగిరావలసి ఉంటుంది.
ఆమె తరపున వాదించేందుకు తమకు చాలా తక్కువ సమయం లభించినప్పటికీ కాస్ ముందు పటిష్టమైన వాదనలు వినిపించామని న్యాయవాదులలో ఒకరైన విదుష్పత్ సింఘానియా తెలిపారు. తమ వాదనల పట్ల కాస్ సభ్యులు సానుకూలంగానే స్పందించిన్నట్లు భావిస్తున్నామని చెప్పారు.
తీర్పు అనుకూలంగా వచ్చినా రాకపోయినా, తన సమర్దత నిరూపించుకొని ఫైనల్స్‌కు చేరుకున్న వినేష్ ఫోగట్ గెలిచిన్నట్లే భావిస్తామని అన్నారు. ఆమె పోరాటస్పూర్తి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని విదుష్పత్ సింఘానియా అన్నారు.
తాజా సమాచారం: తీర్పు ఆగస్ట్ 16కి వాయిదా పడింది.