బిగ్‌బాస్‌కే షాక్ ఇచ్చిన కమల్

August 07, 2024


img

హిందీ బిగ్‌బాస్‌ తర్వాత అంతగా ప్రజాధరణ పొందుతోంది తమిళ్ బిగ్‌బాస్‌. అందుకు ఏకైక కారణం ఆ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తుండటమే. అయితే ఇప్పుడు ఆయన బిగ్‌బాస్‌కి ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు.

మరికొన్ని రోజులలో తమిళ్ బిగ్‌బాస్‌-7 అట్టహాసంగా ప్రారంభం కాబోతుండగా, తాను కొంతకాలం బిగ్‌బాస్‌కు హోస్టింగ్ చేయలేనని ప్రకటించారు. తాను ఒప్పుకున్న కొన్ని సినిమాలకు మరింత సమయం కేటాయించాల్సి ఉన్నందున బిగ్‌బాస్‌కు  హోస్టింగ్ చేయలేనని కమల్ హాసన్‌ చెప్పేశారు. 

కమల్ హాసన్‌ లేని బిగ్‌బాస్‌ని తమిళులు ఊహించుకోలేరు అంతగా వారు ఆయనతో మమేకం అయిపోయారు. ఇప్పుడు ఆయన తప్పుకుంటే ఆ లోటు భర్తీ చేయడం చాలా కష్టం. ఈ కార్యక్రమానికి మరో పాపులర్ హీరోని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ బిగ్‌బాస్‌కి కమల్ హాసన్‌ సృష్టించిన ఆ క్రేజ్‌ని కొనసాగించగలరా?లేకపోతే బిగ్‌బాస్‌ పరిస్థితి ఏమిటి?

కమల్ హాసన్‌ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. మణిరత్నం సినిమా అంటే మరో సినిమా లేదా కార్యక్రమానికి సమయం కేటాయించడం చాలా కష్టమే. దాని తర్వాత కల్కి ఎడి2898 రెండో భాగంలో ఈసారి ఎక్కువ నిడివి ఉన్న పాత్ర చేయబోతున్నారు.

శంకర్ దర్శకత్వంలో చేసిన భారతీయుడు -2 అట్టర్ ఫ్లాప్ అవడంతో బహుశః భారతీయుడు-3 ఆలోచన విరమించుకునే ఉండవచ్చు. కానీ అది కూడా మొదలుపెడితే కమల్ హాసన్‌కి అసలు ఖాళీ ఉండదు. కనుక బిగ్‌బాస్‌ మరో కమల్ హాసన్‌ని వెతుక్కోవలసిందే తప్పదు.


Related Post