హసీనా చిర్నవ్వు కూడా కష్టమే

August 06, 2024


img

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాకూడని కష్టం వచ్చింది. ఆ దేశంలో ప్రజాతిరుగుబాటు జరగడంతో తన పదవికి రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకోవడానికీ భారత్‌ చేరుకున్నారు. భారత్‌ నుంచి ఆమె లండన్‌ వెళ్ళి స్థిరపడాలనుకున్నారు.

ఆమె సోదరి రెహనాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. ఆ దేశంలో అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కూడా. కనుక బ్రిటన్ తనకు తప్పకుండా రాజకీయ ఆశ్రయం కల్పిస్తుందని షేక్ హసీనా భావించారు.

కానీ ఆమె మొదట ఎక్కడ ఆశ్రయం పొందారో అక్కడే ఉండటం మంచిదంటూ సున్నితంగా ఆమె అభ్యర్ధనని తిరస్కరించింది. దీంతో షేక్ హసీనాకు మరే దేశమైనా ఆశ్రయం ఇస్తే తప్ప భారత్‌లోనే ఆశ్రయం పొందాల్సి ఉంటుంది. 

ఆమెకు బాంగ్లాదేశ్ వీడి రావడం ఇష్టం లేదు. కానీ ప్రాణభయంతో బయటకు రాక తప్పలేదు. ఆమె దేశం వీడగానే ఢాకాలో ఆమె అధికార నివాసం, ఆమె భర్త నివాసాలపై ఆందోళనకారులు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు.

బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పొరాడి జాతిపితగా గుర్తింపు పొందిన ఆమె తండ్రి, దివంగత ప్రధాని ముజుబుర్ రహమాన్ విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారంటే ఆమె కుటుంబంపై ప్రజలు ఎంతగా రగిలిపోతున్నారో అర్దం చేసుకోవచ్చు.

పైగా ఆమెతో విభేధాల కారణంగా అమెరికా కూడా ఆమెను గద్దె దించడానికి తెరవెనుక పావులు కదిపిందనే వార్తలు వస్తున్నాయి. కనుక ఆమె ఎట్టి పరిస్థితులలో తన దేశానికి తిరిగి వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. హసీనా అంటే చిర్నవ్వుతో ఉండే వ్యక్తి అని అర్దం. కానీ ఆమె ఇప్పుడు చిర్నవ్వు కూడా నవ్వలేని పరిస్థితిలో ఉన్నారు.


Related Post