స్పీకర్‌ని హైకోర్టు ఆదేశించగలదా?

August 06, 2024


img

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని ఆదేశించాలని కోరుతూ బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈకేసుని విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఉద్దేశ్యించి, “దీనిపై హైకోర్టు జోక్యం చేసుకునేవరకు స్పీకర్‌ ఎటువంటి చర్యలు చేపట్టరా?బిఆర్ఎస్ పిటిషన్‌పై స్పందించడానికి స్పీకర్‌కి ఇంకా ఎంత సమయం కావాలి?ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు?” అని సూటిగా ప్రశ్నించారు. 

ఏజీ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ, “ఇది రాజ్యాంగానికి సంబందించింది. దీనిలో న్యాయస్థానాలు జోక్యం తగదు. స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై పిటిషన్‌ దాఖలైతే తప్పకుండా స్పందించవచ్చు. కానీ స్పీకర్‌ పరిధిలో ఉన్న ఈ అంశంపై నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయడం,. జోక్యం చేసుకోవడం సరికాదు,” అని స్పష్టం చేశారు. 

ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలు స్పీకర్‌ని కలిసి వారిపై అనర్హత వేటు వేయాలని కోరినా పట్టించుకోలేదు. పైగా కేసీఆర్‌ వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే చేస్తే బిఆర్ఎస్ పార్టీకి తప్పుగా కనిపిస్తోంది. వెంటనే స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. అంటే తాము చేస్తే ఒప్పు ఎదుటవాళ్ళు చేస్తే తప్పు అని భావిస్తోందన్న మాట! బిఆర్ఎస్ పార్టీ అనర్హత వేటువేయాలని కోరుతున్నవారిలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. 


Related Post