ఉద్యోగాల కోసం బిఆర్ఎస్‌ ధర్నా.... సిగ్గు సిగ్గు!

August 03, 2024


img

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్ నేత హరీష్ రావుల నేతృత్వంలో బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌ గన్‌పార్క్ వద్ద నేడు ధర్నా చేశారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు వారందిరినీ బలవంతంగా వ్యానులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. 

శాసనసభలో సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా మాట్లాడితే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ శాసనసభలో రౌడీలా తమని బెదిరించారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిన్న శాసనసభలో ప్రకటించిన జాబ్ క్యాలండర్‌ కాదు అదో ‘ఫేక్ క్యాలండర్’ అని దాంతో రాష్ట్రంలో నిరుద్యోగులను మోసగించాలని ప్రయత్నిస్తోందని కేటీఆర్‌, హరీష్ రావులు ఆరోపించారు. 

దీనిపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో, “పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వోద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం జై తెలంగాణ,” అంటూ మెసేజ్, ఫోటో పెట్టారు. 

అయితే కేసీఆర్‌ పదేళ్ళు అధికారంలో ఉన్నా ‘జాబ్ క్యాలండర్‌’ విడుదల చేయలేకపోయింది. కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7-8 నెలల్లోనే జాబ్ క్యాలండర్‌ ప్రకటించారు. నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలండర్‌ ప్రకటిస్తున్నప్పుడు, కేటీఆర్‌తో సహా ఇప్పుడు ధర్నా చేస్తున్నవారందరూ శాసనసభలోనే ఉన్నారు. 

తాము చేయలేకపోయిన పనిని రేవంత్‌ రెడ్డి చేసినందుకు అభినందించకపోగా నేడు ఉద్యోగాలు భర్తీ చేయలేదంటూ ధర్నా చేస్తుండటం చాలా హాస్యస్పదంగా ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం కనీసం టీజీపీఎస్‌ఎస్సీ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోయింది. నిరుద్యోగభృతి ఇవ్వకుండా తప్పించుకుంది. తమ ఈ వైఫల్యాలను, హామీలు అమలుచేయకపోవడాన్ని మరిచిన్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం సిగ్గుచేటు కాదా?


Related Post