మందకృష్ణ మాదిగ కొత్త డిమాండ్!

August 03, 2024


img

ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటాలు ఫలించి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆయనను అందరూ అభినందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు విద్యా, ఉద్యోగాలలో ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో ప్రకటించారు కూడా. పొరుగు రాష్ట్రం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. కనుక రెండు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేందుకు మందకృష్ణ మాదిగ కృషి చేస్తే బాగుండేది. కానీ ఆయన మరో కొత్త ఉద్యమం మొదలుపెడతానని ప్రకటించారు. 

“ప్రభుత్వ రంగంలో క్రమంగా ఉద్యోగావకాశాలు తగ్గిపోతుంటే ప్రైవేట్ రంగంలో శరవేగంగా పెరుగుతున్నాయి. కనుక ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు కోసం కొత్త పోరాటం ప్రారంభిస్తాము,” అని మందకృష్ణ మాదిగ అన్నారు. 

భారీ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఏర్పాటుచేసేవారు వాటి ద్వారా లాభాలు ఆర్జించాలనుకుంటారు. కనుక మెరిట్ ఆధారంగా ఉద్యోగులను భర్తీ చేసుకుంటారు. కొన్ని బహుళజాతి కంపెనీలు తమ ఉద్యోగులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తుంటాయి. కానీ రిజర్వేషన్ కోటాలో ఉద్యోగులను తీసుకోమని ఒత్తిడి చేస్తే అవి వేరే చోటికి తరలిపోతాయి. 

ఇందుకు తాజా ఉదాహరణగా కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసినప్పుడు నాస్కం తీవ్రంగా వ్యతిరేకించింది. దీని వలన కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతాయని హెచ్చరించింది. దానిపై ఏపీ ఐ‌టి శాఖ మంత్రి నారా లోకేష్‌ ఐ‌టి కంపెనీలను ఉద్దేశ్యించి, “మీ బాధ నేను అర్దం చేసుకోగలను. ఒకవేళ మీరు అక్కడ (బెంగళూరు) నుంచి వేరే చోటికి వెళ్ళాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌ సాధారంగా మీకు స్వాగతం పలుకుతుంది,” అని ట్వీట్‌ చేశారు.      

కనుక ఎస్సీ వర్గీకరణకు అమలుచేయడానికి అంగీకరించిన ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ సెక్టర్‌లో రిజర్వేషన్స్ అమలుకి అంగీకరించవని స్పష్టం అవుతోంది. అయినా మందకృష్ణ మాదిగ పోరాటం ప్రారంభిస్తే ఎస్సీ వర్గీకరణతో ఆయనకు దక్కిన గౌరవం కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.


Related Post