గద్వాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ రెండు రోజుల క్రితం మళ్ళీ తాను బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయానని సూచిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులను కలిసివారితో ఫోటోలు దిగారు.
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేయడంతో బిఆర్ఎస్ పార్టీ ‘చూశారా మా దెబ్బ’ అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టుకొని మురిసిపోయింది కూడా.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని బుజ్జగించి కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సిందిగా కోరారు. దాంతో ఆయన మళ్ళీ మనసు మార్చుకొని జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు.
తర్వాత సిఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఆయన ఫోటోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారని స్పష్టం చేసిన్నట్లు భావించవచ్చు. ఆయన బిఆర్ఎస్ పార్టీకి తిరిగివస్తే ఆయనను మెచ్చుకున్న కేటీఆర్ ఇప్పుడేమి అంటారో?