ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, కనుక అవి తగిన మార్గదర్శకాలు రూపొందించుకొని అమలుచేయవచ్చని సుప్రీంకోర్టు నేడు సంచల తీర్పు చెప్పడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.
దీనిపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు శాసనసభలో స్పందిస్తూ, “ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల యువకులు, కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా పోరాడుతున్నారు. దీని కోసం ఇదివరకు నేను, మా ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ నుంచి వాకవుట్ చేశాము.
మేము అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచాన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలను అడ్వకేట్ జనరల్‌ని ఢిల్లీకి పంపించి న్యాయనిపుణులతో చర్చించాము. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన వాదనలు వినిపించగలిగాము.
కనుక ఇన్నేళ్ళ మా కల, కృషి ఫలించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాము. సుప్రీంకోర్టు ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
దీనిని తక్షణమే రాష్ట్రంలో అమలుచేసేందుకు అవసరమైన చర్యలు చేపడతాము. ఇప్పటి వరకు ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లతో పాటు ఇకపై జారీ చేయబోయే అన్ని ఉద్యోగాలకు దీనిని వర్తింపజేస్తాము,” అని అన్నారు.