తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సిఎం కేసీఆర్ తప్పక హాజరవుతారని సంకేతాలు పంపారు. ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున వచ్చారు. శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద బడ్జెట్‌పై విమర్శలు గుప్పించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ శాసనసభకు రాలేదు.
ఎందుకు రావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే అడుగుతున్నా కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.
అక్కడ ఏపీలో అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రాకుండా మొహం చాటేశారు. కానీ తన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధర్నా చేసి వచ్చారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో శాసనసభ సమావేశాలు త్వరగా ముగిసిపోవవడంతో జగన్ ఈసారికి తప్పించుకోగలిగారు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగేలేదన్నట్లు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా భయపడుతున్నారు.... అని అధికార పార్టీలు ఎద్దేవా చేస్తున్నా ఇద్దరూ శాసనసభకు రావడం లేదు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు ఎందుకు రాలేదో కారణం చెప్పలేదు. కానీ వారిద్దరికీ ‘ఇగో ప్రాబ్లెమ్’ ఉంది.
కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి అంటే, జగన్‌కు చంద్రబాబు నాయుడు అంటే చాలా ద్వేషం, చులకనభావం ఉన్నాయి. ఇప్పుడు వారిరువురూ ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో మాట్లాడుతుంటే చూసి తట్టుకోవడం జగన్, కేసీఆర్ ఇద్దరికీ కష్టమే. అదీగాక శాసనసభకు వెళితే అధికార పార్టీ సభ్యులు తమని అవమానిస్తారేమో? అనే భయంతోనే ఇద్దరూ శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతున్నట్లు అనుమానించాల్సి వస్తోంది.
జగన్ తాను డుమ్మా కొట్టడమే కాకుండా 10 మంది ఎమ్మెల్యేలని కూడా శాసనసభ సమావేశాలకు వెళ్ళనీయలేదు. ఈవిషయంలో జగన్ కంటే కేసీఆర్ నయం. ఆయన తన ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. వారు కూడా కేసీఆర్ లేరని భయపడకుండా శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆవిదంగా వారు కేసీఆర్ పరువు కాపాడుతున్నారని చెప్పవచ్చు.