తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినీ పెద్దలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సిఎం రేవంత్ రెడ్డిని కలిసి మళ్ళీ నంది అవార్డుల కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సిఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. కానీ నందీ అవార్డులకు బదులు ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఏటా డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇస్తామని ఆ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా జరుపుకుందామని చెప్పారు.
నంది అవార్డుల గురించి టాలీవుడ్ పెద్దలు, ఆ ప్రతిపాదనపై ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
నేడు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ, “ఇదివరకు ఇదే వేదికపై గద్దర్ జయంతి జరుపుకుంటున్నప్పుడు నేను ఈ ప్రతిపాదన చేశాను. తెలంగాణజాతి మేలిరత్నం గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చి కళాకారులను సన్మానించుకోవడం మాకూ ఎంతో సంతోషం, గౌరవంగా ఉంటుందని చెప్పాను.
కానీ నా ఈ ప్రతిపాదనపై సినీ పెద్దలు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. కనీసం స్పందించలేదు. కనీసం ఇప్పటికైనా స్పందించి మీ అభిప్రాయం, సూచనలు మాకు తెలియజేస్తే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.