మెట్రో పేరుతో మజ్లీస్‌కు బంపర్ ఆఫర్?

July 28, 2024


img

తెలంగాణ శాసనసభ సమావేశాలలో నిన్న ఎవరూ ఊహించని ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. హైదరాబాద్‌ మెట్రోపై జరిగిన చర్చలో పాల్గొన్న మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ “పాతబస్తీకి ఇంకా ఎప్పుడు వస్తుంది? ఎప్పటికైనా అసలు వస్తుందా రాదా?” అంటూ ప్రశ్నించినప్పుడు, సిఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు ఊహించని సమాధానం ఇచ్చారు. 

హైదరాబాద్‌కు మెట్రో తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.  మీరు మీ పాత దోస్తు (కేసీఆర్)కి పదేళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన పాతబస్తీకి మెట్రో ఏర్పాటు చేయలేదు. కనుక మీరు ఇప్పుడు ఈ కొత్త దోస్తుకి కేవలం 5 ఏళ్ళు సమయం ఇవ్వండి చాలు. వచ్చే ఎన్నికలలోగా పాతబస్తీకి మెట్రో వేసి, దానిలోనే మన ఇద్దరం కలిసి పాతబస్తీకి వెళ్ళి ఓట్లు అడుగుదాము.

ఒకవేళ అలా చేయలేకపోతే అక్బరుదీన్ ఓవైసీకి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చి కొడంగల్‌ నుంచి శాసనసభకు పోటీ చేయించి గెలిపించుకొని, ఉప ముఖ్యమంత్రిని చేస్తాము. ఈ బాధ్యత నేను తీసుకుంటాను,” అని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన సమాధానంతో కాంగ్రెస్‌ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. 

పాతబస్తీకి మెట్రో తీసుకువస్తానని చెప్పడం బాగానే ఉంది. తీసుకురాకపోతే రాజకీయ సన్యాసం చేస్తాననో మరొకటో స్టాండర్డ్ డైలాగ్ చెపితే సరిపోతుంది. కానీ మజ్లీస్‌ ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెల్పించుకొని డెప్యూటీ సిఎం పదవి ఇస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పడం ఏదో యధాలాపంగా చెప్పిన్నట్లు అనుకోలేము.

బీజేపీకి దగ్గరయ్యేందుకు బిఆర్ఎస్ పార్టీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా శాసనసభలోనే చెప్పారు. వాటి వలన తన ప్రభుత్వానికి ఏదోరోజు ప్రమాదం తప్పదని సిఎం రేవంత్‌ రెడ్డి గట్టిగా నమ్ముతున్నట్లున్నారు.

అందుకే మజ్లీస్‌ మద్దతు కోసం అది ఎన్నో ఏళ్ళుగా కలలుగంటున్న డెప్యూటీ సిఎం పదవిని ఇస్తామని ఈ వంకతో సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన్నట్లు భావించవచ్చు.

కానీ మజ్లీస్‌ పార్టీకి డెప్యూటీ సిఎం పదవి కోసం పాతబస్తీకి మెట్రో రానక్కరలేదు. వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూడాల్సిన అవసరం కూడా లేదు.

ఒకవేళ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నిస్తే, మజ్లీస్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామి అయితే చాలు అక్బరుదీన్ ఓవైసీ డెప్యూటీ సిఎం కావడం తధ్యం.


Related Post