రేవంత్‌ కూడా కేంద్రంతో యుద్ధానికి సై?

July 25, 2024


img

కేసీఆర్‌ తొలిసారి తెలంగాణ సిఎం అయినప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో కేంద్రంతో చాలా సఖ్యతగా ఉండేవారు. అయితే ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూయడం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను పోరాడుతున్నానని కేసీఆర్‌ చెప్పుకున్నప్పటికీ, అది జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసమే అని ఆ తర్వాత ఆయనే నిరూపించుకున్నారు. కానీ ఆ పోరాటాల వలన రాజకీయంగా ఆయన నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం కూడా చాలా నష్టపోయింది. 

సిఎం రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌లాగే తొలుత ప్రధాని మోడీతో విధేయంగా, సఖ్యతగా వ్యవహరించారు. ఆయన రాష్ట్రానికి వస్తే సగౌరవంగా ఆహ్వానించి పెద్దన్న పెద్దన్న అంటూ ఆయన వెంట తిరిగారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయాలని వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. 

కానీ తెలంగాణ ప్రస్తావన లేకుండానే బడ్జెట్‌ ప్రకటించారు. అది చూసి సిఎం రేవంత్‌ రెడ్డి కూడా షాక్ అయ్యారు. నిన్న శాసనసభలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కనుక ఈ సమావేశాలలోనే తెలంగాణకు సంబందించి దానిని సవరించి అవసరమైన నిధులు కేటాయించాలని తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించారు. దానిని కేంద్రానికి పంపబోతున్నారు. 

బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపినందుకు నిరసనగా ఈ నెల 27న ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరుకాబోనని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అఖిలపక్షంతో ఢిల్లీలో నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు.

తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంపినంత మాత్రన్న కేంద్రం బడ్జెట్‌లో సవరణలు చేయదు, కానీ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు చేస్తోందో, వాటిపై కేంద్రం ఎన్ని వేలు లేదా లక్షల కోట్లు ఖర్చు చేస్తోందో లెక్కలు చెపుతుంది.

అవన్నీ సిఎం రేవంత్‌ రెడ్డికి కూడా తెలుసు. కానీ కేంద్రంపై యుద్ధం  ప్రకటించేశారు కనుక చేయడం తధ్యం. తెలంగాణ కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వం మద్య యుద్ధం మొదలైతే అది బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను కలిపినా ఆశ్చర్యం లేదు.

అదే జరిగితే కేసీఆర్‌ చెపుతున్నట్లు రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయమార్పులు జరిగే అవకాశం ఉంది... అని సిఎం రేవంత్‌ రెడ్డికి కూడా తెలుసు కనుక శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత చల్లబడినా చల్లబడవచ్చు.


Related Post