తెలంగాణ శాసనసభ సమావేశాలలో నేడు సిఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మద్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగాయి. “కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని” సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించగా, “మీకు కేసీఆర్ అవసరం కాదు. బడ్జెట్‌పై మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపితే చాలు,” అని కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ “నేను మీలాగ తండ్రి పేరు చెప్పుకొని మంత్రిని కాలేదు కింద స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యాను. కానీ మీరు ‘మేనేజ్‌మెంట్ కోటా’లో మంత్రి అయ్యారు. కనుక మీకు ఏమీ తెలీకపోయి ఉండొచ్చు,” అని అన్నారు.
కేటీఆర్ స్పందిస్తూ “మేము కూడా మీరు పేమెంట్ కోటాలో సిఎం అయ్యారని అనొచ్చు” అని వ్యంగ్యంగా అన్నారు. దానిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “నేను ఏ కోటాలో సిఎం కాలేదు. కానీ మీరే ఢిల్లీ వెళ్ళి చీకట్లో (బీజేపీతో) మాట్లాడుకొనివచ్చారు,” అని ఘాటుగా బదులిచ్చారు.
కేసీఆర్ తనకు ఏమీ అక్కర్లేదంటూనే రాష్ట్రాన్ని దోచుకొని దివాళా తీయించేశారని, కనీసం సరైన విద్యుత్ విధానం కూడా లేదని విమర్శించారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి మా నెత్తిన పెట్టి పోయారు. అందుకే ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
అయితే అధికారంలో లేని కేసీఆర్ తిడుతూ కాలక్షేపం చేయడం మానుకొని దమ్ముంటే కేసీఆర్‌లాగా మోదీతో యుద్ధం చేసి రాష్ట్రానికి రావలసినవి సాధించుకురావాలని కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ పెద్దలను అడుక్కుంటే ఏమీ ఇవ్వదు కనుక శాశించి సాధించుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
అయితే కేసీఆర్ పదేళ్ళలో శాశించి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి చూపారు కదా? మీకు తెలియదా? అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలిసి బీజేపీతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని కేటీఆర్ చెప్పడం కొస మెరుపు.