శాసనసభలో హరీష్ రావు తప్పటడుగు వేశారా?

July 24, 2024


img

నేడు రెండో రోజున శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు టిజిఎస్‌ఆర్టీసీ ప్రస్తావన చేసి రేవంత్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకొని తానే అడ్డంగా దొరికిపోయారు.  

టిజిఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ఉద్యోగులకు రూ.300 కోట్ల పీఆర్‌సీ బకాయిల చెల్లింపు, కొత్త యూనియన్ల ఏర్పాటుచేయడం, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై హరీష్ రావు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. 

అయితే తమ హయాంలో 55 రోజులపాటు సాగిన టిజిఎస్‌ఆర్టీసీ సమ్మె, అప్పుడు వారితో కేసీఆర్‌ ఏవిదంగా వ్యవహరించారనే విషయం హరీష్ రావు మరిచిపోయిన్నట్లు రేవంత్‌ ప్రభుత్వాన్ని టిజిఎస్‌ఆర్టీసీ గురించి ప్రశ్నించడంతో కాంగ్రెస్‌ మంత్రులకు దొరికిపోయారు. 

రవాణాశాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ జవాబిస్తూ, “ఆనాడు సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నా కేసీఆర్‌ పట్టించుకోలేదు. వారితో చాలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. ఆర్టీసీ కార్మిక నేతలను కేసీఆర్‌ చాలా దారుణంగా అవమానించారు. 

వారి యూనియన్లను కేసీఆర్‌ చంపేశారు. 2013 నుంచి ఆర్టీసీకి మొండి బకాయిలు ఉంటే తీర్చకపోగా, ఆర్టీసీ కార్మికులు సొసైటీలో  దాచుకున్న సొమ్ముని కూడా వాడేసుకోని తిరిగి చెల్లించలేదు. మీ ప్రభుత్వం టిజిఎస్‌ఆర్టీసీని మాకు రూ.7,000 కోట్ల అప్పుతో అప్పగించింది. ఆర్టీసీ ఆస్తులను బిఆర్ఎస్ నేతలు దోచుకున్నారు.  

మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహాలక్ష్మి పధకం కోసం టిజిఎస్‌ఆర్టీసీకి నెలనెలా రూ.200 కోట్లు ఇస్తున్నాము. మూడువేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము. మీ పదేళ్ళ పాలనలో టిజిఎస్‌ఆర్టీసీకి ఎంతో కష్టం, నష్టం వచ్చింది. అందుకే టిజిఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించాము. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది,”అంటూ ఘాటుగా బదులిచ్చారు. 

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిజిఎస్‌ఆర్టీసీ సంస్థతో, ఆర్టీసీ కార్మికులతో చాలా దారుణంగా వ్యవహరించి ఇప్పుడు వారి గురించి హరీష్ రావు శాసనసభలో మొసలి కన్నీళ్ళు కార్చితే కాంగ్రెస్‌ మంత్రులు ఊరుకుంటారా? కనుక టిజిఎస్‌ఆర్టీసీ గురించి హరీష్ రావు ప్రస్తావించి తప్పటడుగు వేశారనే చెప్పవచ్చు.


Related Post