రుణమాఫీతో రాజకీయాలు దేనికంటే...

July 19, 2024


img

తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి పంట రుణాల మాఫీ పధకాన్ని అమలు చేస్తుండటంతో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య సరికొత్త యుద్ధం మొదలైంది. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులుంటే అందరికీ మాఫీ చేయకుండా కేవలం 11 లక్షల మందికి మాఫీ చేసి రేవంత్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ కేటీఆర్‌, హరీష్ రావు విమర్శిస్తున్నారు. 

కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష రూపాయల రుణాలు మాఫీ చేయడానికి పదేళ్ళు సమయం తీసుకుందని అది కూడా నాలుగు వాయిదాలలో చెల్లించడం వలన అది వడ్డీలకు కూడా సరిపోలేదని, కానీ తమ ప్రభుత్వం అధికరంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఏకంగా రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేసిందని కాంగ్రెస్‌ మంత్రులు వాదిస్తున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. కనుక దానిపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే కేటీఆర్‌, హరీష్ రావు పంట రుణాలు మాఫీ అంశాన్ని హైలైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నట్లు భావించవచ్చు. పనిలో పనిగా పంట రుణాలు మాఫీ పధకం లభించని రైతులను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

బిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ కాంగ్రెస్‌కు తెలుసు. పైగా ఆర్ధిక సమస్యల కారణంగా రైతు భరోసా వంటి హామీలు అమలుచేయలేకపోతోంది. సాగుత్రాగు నీరు, విద్యుత్ సరఫరా, అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలలో ప్రజల అంచనాలను అందుకోలేకపోతోంది. ఈ బలహీనత బిఆర్ఎస్ పార్టీ ఆయుధంగా మార్చుకుంటోంది. కనుక చాలా భారమైనప్పటికీ పంట రుణాలు మాఫీ పధకాన్ని అమలుచేసి దాంతో బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. 


Related Post