శాసనసభ సమావేశాల ప్రస్తావన వస్తే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గుర్తువస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో శాసనసభ సమావేశాలు జరిగాయి. వాటికి కేసీఆర్ హాజరుకాలేదు.
తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునందున విశ్రాంతి తీసుకుంటున్నారని సరిపెట్టుకోవడానికి కూడా లేదు. ఎందువల్ల అంటే నల్గొండలో లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు కనుక. శాసనసభ సమావేశాలకు రాకుండా ఎన్నికల ప్రచారసభకు వెళ్ళి అక్కడ తమ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడాన్ని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు తప్పు పట్టారు. కేసీఆర్‌కి దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. అయినా కేసీఆర్ వెళ్ళలేదు.
అప్పటితో పోలిస్తే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడంతో కేసీఆర్ ప్రతిష్ట మసకబారింది. ఆ కారణంగా ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరో 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెపుతున్నారు.
మరో పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులు ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై రెండు కమీషన్లు విచారణ జరుపుతున్నాయి.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలుచేయలేక చేతులెత్తేస్తోందని బిఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి చెక్ పెడుతున్నారు. శాసనసభ సమావేశాలకు ముందే ఆ పధకం అమలుచేయడం కూడా వ్యూహాత్మకమే అని భావించవచ్చు. కనుక ఒకవేళ కేసీఆర్ శాసనసభకు వస్తే ఈ పధకంతో సహా నిరుద్యోగభృతి తదితర హామీలపై కాంగ్రెస్ సభ్యులే కేసీఆర్‌ని నిలదీసే అవకాశం ఉంది.
ముఖ్యంగా తమ పార్టీకి చెందిన 10 మంది సీనియర్ ఎమ్మెల్యేలు శాసనసభలో కాంగ్రెస్‌తో కలిసి ఎదురుదాడి చేస్తుంటే కేసీఆర్ భరించడం చాలా కష్టమే. కనుక శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవచ్చు. హాజరుకాకపోయినా కాంగ్రెస్ పార్టీ విమర్శలు తప్పవు. రెండున్నర దశాబ్ధాలు తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాశించిన కేసీఆర్, శాసనసభకు వెళ్ళేందుకు భయపడితే అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?