పంట రుణాలు మాఫీ చేశాం. హరీష్ రాజీనామా చేయాలి!

July 18, 2024


img

లోక్‌సభ ఎన్నికల సమయంలో సిఎం రేవంత్‌ రెడ్డి ఆగస్ట్ 15లోగా పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇస్తూ రైతులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుండటంతో, మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన వ్యూహానికి ప్రతివ్యూహంగా రేవంత్‌ రెడ్డి నిజంగా పంట రుణాలు మాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. రేవంత్‌ రెడ్డి ఎన్నికల కోసమే పంట రుణాల మాఫీ అంటూ రైతులను మభ్యపెడుతున్నారని వాదించారు.  

కానీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన్నట్లే నేటి నుంచి పంట రుణాల మాఫీ కార్యక్రమం ప్రారంబించి తొలివిడతగా లక్ష రూపాయలు వరకు రుణాలకు సరిపడా నగదును రైతుల ఖాతాలలో జమ చేశారు. ఈ నెలాఖరులోగా లక్షన్నర, ఆగస్ట్ మొదటి వారంలోగా రెండు లక్షల వరకు పంట రుణాల సొమ్ముని రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమా చేయబోతోంది. 

తాము చెప్పిన్నట్లే తొలివిడత పంట రుణాలు మాఫీ చేశాము కనుక హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే వారు ఈవిదంగా అడుగుతారని ఊహించిన హరీష్ రావు వారికంటే ముందే మీడియా సమావేశం పెట్టి, తాను ఆరు గ్యారెంటీలను అమలుచేస్తే రాజీనామా చేస్తానని చెప్పాను తప్ప పంట రుణాల మాఫీ చేస్తే కాదని మాట మార్చారు.

కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో వచ్చాయి. కనుక కాంగ్రెస్‌ నేతలు అంత సులువుగా ఆయనని విడిచిపెట్టకపోవచ్చు. వాటిని చూపించి రాజీనామా కోసం ఒత్తిడి చేయవచ్చు.


Related Post