రేవంత్‌ని చూసి సిద్దరామయ్య నేర్చుకుంటే మంచిది!

July 18, 2024


img

కర్ణాటక సిఎం సిద్దరామయ్య, డెప్యూటీ డికె శివకుమార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎంతగానో తోడ్పడ్డారు. వారి తోడ్పాటుతో తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి మాత్రం అనేక గడ్డు సమస్యలను ఎదుర్కుంటూనే సజావుగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండటం విశేషం. కానీ వారిరువురూ తమ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంటే కాపాడుకోలేకపోతున్నారు.

బెంగళూరు ఐ‌టి కంపెనీలకు కేంద్రంగా నిలుస్తోంది. వాటి వలనే బెంగళూరు అంతగా అభివృద్ధి చెందింది. రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తోంది. లక్షల మందికి అవి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నాయి కూడా.

అయితే వాటిలో 50-75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, అటెండర్లు, స్వీపర్స్ వంటి దిగువ స్థాయి ఉద్యోగాలన్నీ 100 శాతం స్థానికులకే ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం చట్టం చేసేందుకు సిద్దపడింది. అదే తెలియజేస్తూ సిఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో ఓ మెసేజ్ కూడా పెట్టి మళ్ళీ వెంటనే చెరిపేశారు.

 కానీ ఈ ప్రతిపాదనపై ఐ‌టి కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇటువంటి ఆలోచన కూడా మంచిది కాదని, అలా చేస్తే రాష్ట్రంలో ఐ‌టి కంపెనీలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్ళిపోతాయని హెచ్చరిస్తూ నాస్కామ్ ప్రభుత్వానికి ఓ లేఖ కూడా వ్రాసింది.

ఈవిషయం తెలుసుకున్న ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ బెంగళూరు నుంచి వేరే చోటికి తరలిపోవాలనే ఐ‌టి కంపెనీలకు మా ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. సుందరమైన విశాఖ నగరంలో ఐ‌టి కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రోత్సాహకాలు కూడా అందించడానికి సిద్దంగా ఉన్నామంటూ,” ట్వీట్‌ చేశారు. 

ఈ పరిణామాలతో కంగుతిన్న సిద్దరామయ్య ప్రభుత్వం ఈ బిల్లుని పక్కన పెట్టేయక తప్పలేదు. 

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఓపక్క కేసీఆర్‌ మరో పక్క బీజేపీ కాసుకు కూర్చున్నాయి. ఇచ్చిన హామీలను అమలుచేయాలని బిఆర్ఎస్ తెగ ఒత్తిడి చేస్తోంది. రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టనే లేదు.

పైగా సాగు, త్రాగునీరు, 24 గంటలు విద్యుత్ అందించలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో కూడా సిఎం రేవంత్‌ రెడ్డి చాలా నిబ్బరంగానే సాగుతున్నారు. 

నేటి నుంచి పంట రుణాల మాఫీ పధకం అమలు చేస్తుండటం ద్వారా తన ప్రభుత్వం సమస్యలు, లోపాలు, వైఫల్యాలు అన్నిటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించి వారే తమని మెచ్చుకునేలా చేసుకుంటున్నారు. అందువల్లే పంట రుణాల మాఫీపై బిఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రజలు, రైతులు పెద్దగా పట్టించుకోవడం లేదు. 

కనుక తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటితో పోలిస్తే కర్ణాటక సిఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న సమస్యలు చాలా తక్కువే... చాలా చిన్నవే అని చెప్పవచ్చు. 

తొలిసారిగా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇన్ని సమస్యలతో పోరాడుతున్న రేవంత్‌ రెడ్డి తెలివిగా ప్రజలలో మంచిపేరు సంపాదించుకుంటుంటే, ఎంతో రాజకీయ, పరిపాలన అనుభవం కలిగిన సిద్దరామయ్య సమస్యలు, వివాదాలు సృష్టించుకొని ఇబ్బంది పడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా? 


Related Post