గత కొన్ని రోజులుగా హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన పటాన్‌చెరులో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేనున్నాని భరోసా ఇవ్వడం చాలా విచిత్రంగా ఉంది.
పార్టీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా బిఆర్ఎస్ పార్టీకి ఏమీ ఢోకా లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నామని అన్నారు. పార్టీ మారిన ప్రతీ ఎమ్మెల్యేపై అనర్హత పడే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.
పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిన ప్రతీసారి బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఊహాగానాలు వినిపించాయని కానీ ఎన్నికలలో గెలిచి పదేళ్ళు అధికారంలో కూడా ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడూ అలాగే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, కనుక అంతవరకు పార్టీ కార్యకర్తలు నిబ్బరంగా ఉంటూ కష్టపడి పనిచేయాలన్నారు.
పార్టీ కార్యకర్తల శ్రమతోనే మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలిచారని కానీ ఆయన పార్టీని మోసం చేసి వెళ్లిపోయారన్నారు. ఇంతకాలం కార్యకర్తల పట్ల ఎక్కువ శ్రద్ద చూపలేకపోయామని, ఇకపై కార్యకర్తలకు అండగా నిలబడతామని, కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకి బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.
ఓ పక్క బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క హరీష్ రావు బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో హరీష్ రావు పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు పోరాడుతామని, కార్యకర్తలకు అండగా నిలబడతానని హామీలు ఇస్తుండటం విచిత్రంగానే ఉంది కదా?ముందు ఈ వార్తలు, ఊహాగానాలపై ఆయన కార్యకర్తలకు స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా?