తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచే రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పధకాన్ని అమలుచేయబోతోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఇంకా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టక మునుపే ఈ హామీని అమలు చేయడం మామూలు విషయమేమీ కాదు.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంట రుణాల మాఫీకి ఏవిదంగా మీనమేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేసిందో అందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి హామీ అమలుచేయనే లేదు.
కనుక రేవంత్ ప్రభుత్వం ఇంత త్వరగా ఈ హామీని అమలుచేస్తున్నందుకు అభినందించాలి. వీలైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి తోడ్పడాలి. కానీ హరీష్ రావు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టేశారు.
ఈ పధకం అమలు చేసి రైతులందరికీ మేలు చేయాలనే ఆలోచనకంటే, అనేక ఆంక్షలు విధించి ఈ పధకం నుంచి ఎంత మంది రైతులను తప్పించగలమా? అని ప్రయత్నిస్తున్నట్లుందని అన్నారు. ఎన్నికలలో రైతులందరికీ ఈ పధకం అని చెప్పి, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులున్నవారికి మాత్రమే అని చెప్పడం రైతులను మోసం చేయడమే అని అన్నారు. ఎటువంటి ఆంక్షలు విధించకుండా రాష్ట్రంలో రైతులందరికీ ఈ పధకాన్ని అమలుచేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అయితే బిఆర్ఎస్ పార్టీ కూడా అందరికీ అన్ని పధకాలు అన్నట్లే ఎన్నికల ప్రచారంలో చెపుతుంది. కానీ అధికారంలోకి వచ్చాక తెల్ల రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని పధకాలను వారికి మాత్రమే వర్తింపజేసింది కదా?
అయినా రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిదంగా ఉందో తెలిసి కూడా ఈవిదంగా మాట్లాడుతూ రాజకీయాలు చేయడం సబబేనా?ఏ ప్రభుత్వామైనా రాష్ట్రంలో అందరికీ అన్ని పధకాలు ఇవ్వగలదా? తమ పార్టీ ఇస్తుందని హరీష్ రావు చెప్పగలరా?