నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం కాబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కేసీఆర్ స్పందించకపోవడంతో ఆయన ఆప్త మిత్రుడు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతోందా లేక బయట నుంచి మద్దతు ఇస్తుందా? కేసీఆర్ చెప్పాలని కోరారు.
అయితే ఇంతకాలం ప్రధాని మోడీపై కత్తులు దూస్తూ, ఆయనని గద్దె దించి బీజేపీని బంగాళాఖాతంలోకి విసిరేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, ఇప్పుడు పార్టీని కాపాడుకోవడానికి, కూతురు కల్వకుంట్ల కవితని జైలు నుంచి విడిపించుకోవడానికి ప్రధాని మోడీ ముందు చేతులు కట్టుకొని నిలబడగలరా?అంటే కాదనే అర్దమవుతోంది. కనుక రాజ్యసభలో బీజేపీకి అవసరమైనప్పుడు తన నలుగురు ఎంపీలతో మద్దస్తూ ఇస్తూ కూతురుని జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుండవచ్చు.
ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది కనుక నిసహాయ స్థితిలో ఉన్న కేసీఆర్‌తో దోస్తీ చేయాల్సిన అవసరం బీజేపీకి లేనేలేదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల కోసం బిఆర్ఎస్ పార్టీని అడ్డుతొలగించుకోక తప్పదు.
కనుక ఈటల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించి ఆయన ద్వారా బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుతో సహా ముఖ్య నేతలందరినీ ఆకర్షించే ప్రయత్నం తప్పక చేయవచ్చు. బహుశః అందుకే హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయేమో? హరీష్ రావు బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని బండి సంజయ్ కూడా చెప్పేశారు. కనుక రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది.