నాడు ఫిరాయింపులు తప్పనిపించలేదు కానీ...

July 16, 2024


img

కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో పలువురు కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నారు.

ఏమంటే బంగారి తెలంగాణ కోసం అన్నారు తప్ప ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రతిపక్షాలను బలహీనపరచడం తప్పనుకోలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్దామనుకోలేదు.

కానీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తారుమారు అవడంతో వరుసపెట్టి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుంటే తప్పు, రాజ్యాంగ విరుద్దం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వాదిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. 

ఈరోజు పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని కలిసి, కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఫోజులు ఇస్తుంటారు. గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేత పార్టీ మారబోమని రాహుల్ గాంధీ ప్రమాణాలు చేయిస్తుంటారు. హర్యానాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే అతనిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే వారించరు. మా ఎమ్మెల్యేలని కాంగ్రెస్‌లోకి ఫిరాయింపజేసుకుంటుంటే పట్టన్నట్లు చూస్తుండిపోతారు. 

మేము స్పీకర్‌కి ఫిర్యాదు చేసి అప్పుడే నాలుగు నెలలు అవుతోంది. కానీ స్పీకర్‌ ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా కాలక్షేపం చేస్తూ తన పదవికే మచ్చ తెస్తున్నారు,” అంటూ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఈ విషయంలో కేటీఆర్‌ మాట్లాడుతున్న ప్రతీమాట కూడా మొదట బిఆర్ఎస్ పార్టీకే అన్వయించి చూస్తే, తమ పార్టీని తామే తిట్టుకుంటున్నట్లు అనిపించకమానదు. 


Related Post