ఇటీవల కొన్ని రోజులుగా బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహా గానాలు వినిపిస్తున్నాయి. కానీ హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఎవరూ స్పందించకపోవడంతో ఆ ఊహా గానాలకు బలం చేకూరుతోంది.
ఈ ఊహా గానాలపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, “ఒకవేళ హరీష్ రావు మా పార్టీలోకి రావాలనుకుంటే తప్పకుండా ఆహ్వానిస్తాము. అయితే ఆయన ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావలసి ఉంటుంది.
ఆయన మంచి ప్రజాధరణ కలిగిన నాయకుడు కనుక రాజీనామా చేసినా ఉప ఎన్నికలో అవలీలగా గెలవగలరు. అయితే దీనర్ధం ఆయన మా పార్టీలో చేరబోతున్నారనో లేదా మేము ఆయనతో మాట్లాడుతున్నామనో కాదు. మీడియాలో వస్తున్న ఊహా గానాలపై స్పందిస్తున్నాను అంతే. హరీష్ రావుకి మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది. కనుక తన రాజకీయ భవిష్యత్ గురించి తగిన నిర్ణయం తీసుకోగలరు,” అని చెప్పారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. మరో 5-6 మంది రావడానికి సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంటుంటే బీజేపీ చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకుంటుందనుకోలేము.
అయితే బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెపుతుండటం గమనిస్తే, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కాకుండా బీజేపీ సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నట్లుంది. ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళదలిస్తే ఆయనతో పాటు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది.
వారందరూ రాజీనామాలు చేసివస్తే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోవడమే కాకుండా ఉప ఎన్నికలలో ఆ సీట్లను కూడా గెలుచుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే బిఆర్ఎస్ పార్టీ ఇక కోలుకోవడం కష్టం. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ మిగులుతుంది.