గత రెండు మూడు రోజులుగా అన్ని వార్త పత్రికలలో, న్యూస్ ఛానల్స్‌లో బిఆర్ఎస్ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వారు కేసీఆర్ ఆదేశం మేరకే బీజేపీలో చేరేందుకు సిద్దపడ్డారని, ఇదే పనిమీద్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఢిల్లీ వెళ్ళారని, వారు బీజేపీ పెద్దలతో మాట్లాడారని ఆ వార్తల సారాంశం.
కానీ ఈ వార్తలపై సదరు ఎంపీలు కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గానీ స్పందించకపోవడం అనుమానం కలిగిస్తోంది. లేకుంటే వారు వెంటనే స్పందించి బీజేపీతో ఎటువంటి రహస్య అవగాహన కుదుర్చుకోలేదని ఖండించేవారు.
ఒకవేళ కేసీఆర్ బీజేపీతో రహస్య అవగాహనకు ప్రయత్నిస్తున్నట్లయితే దానిని వారు బయటపెట్టలేరు కనుక స్పందించడం లేదనుకోవచ్చు. లేదా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్ళిపోకుండా కాపాడుకునేందుకు కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ కావచ్చు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బిఆర్ఎస్ పార్టీకి పొత్తు కుదురుతోందని, మనమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని పార్టీలో అందరికీ నమ్మకం కలిగించలిగితే, ఎవరూ పార్టీ వీడకుండా ఉంటారని కేసీఆర్ భావిస్తున్నారేమో?