బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎంతగా నచ్చజెపుతున్నప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చెరిన్నట్లయింది.
గాంధీతో పాటు కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ (శేరిలింగంపల్లి), నార్నే శ్రీనివాస్ (హైదర్ నగర్), మంజుల రఘునాధ్ రెడ్డి (చందా నగర్), ఉప్పలపాటి శ్రీకాంత్ (మియాపూర్) కూడా సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరు కాక ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
త్వరలో మరో 5-6 మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పేశారు. అలాగే హరీష్ రావు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇద్దరూ చెపుతున్నారు. ఒకవేళ హరీష్ రావు కూడా పార్టీ వీడితే బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తప్ప మరెవరూ మిగలకపోవచ్చు.