బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలను కేసీఆర్, కేటీఆర్ కూడా ఆపలేకపోతున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయం అని తెలిసిన తర్వాత కేసీఆర్ మిగిలిన ఎమ్మెల్యేలను తన ఫామ్‌హౌస్‌కి పిలిపించుకొని ఎవరూ పార్టీ వీడవద్దని త్వరలోనే రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన మార్పులు వస్తాయని, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని నచ్చజెప్పారు.
కేసీఆర్ ఎంతగా నచ్చజెపుతున్నప్పటికీ ఆయన మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఆయన ముందు బుర్ర ఊపి, బయటకు రాగానే కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. మరో వారం పది రోజులలో మరో ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అంతే కాదు... బిఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న హరీష్ రావు బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందంటూ మరో బాంబు పేల్చారు.
హరీష్ రావు పార్టీ మారుతారంటూ ఊహాగానాలు వినిపించడం ఇదే మొదటిసారి కాదు. ప్రతీసారి ఆయన వాటిని ఖండిస్తూనే ఉన్నారు. అయితే బిఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతున్నప్పుడు హరీష్ రావు కేసీఆర్‌ని అంటిపెట్టుకొని ఉంటారా?
ఒకవేళ ఉండాలనుకున్నా కేసుల భయంతో పార్టీ మారక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొని జైలు పాలైన కూతురు కల్వకుంట్ల కవితనే కాపాడుకోలేకపోతున్న కేసీఆర్, ఎమ్మెల్యేలను కేసుల బారి నుండి కాపాడగలరా? అంటే కాదనే అర్దమవుతోంది.
కనుక కేసుల భయంతో ఒకవేళ హరీష్ రావు కూడా బిఆర్ఎస్‌ని వీడితే ఆయనతో పాటు కనీసం 8-10 మంది ఎమ్మెల్యేలు బయటకు తీసుకుపోవడం ఖాయం. అదే కనుక జరిగితే బిఆర్ఎస్ కధ ముగిసిన్నట్లే అవుతుంది. కనుక హరీష్ రావు అటువంటి ఆలోచనలు చేయకుండా కేసీఆర్ కాపాడుకోవడం చాలా ముఖ్యం.