కేసీఆర్‌ ఎమ్మెల్యేలని పురుగుల్లా చూసేవారు: దానం

July 12, 2024


img

కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌, కేటీఆర్‌ ఎమ్మెల్యేలని పురుగులను చూసిన్నట్లు చూసేవారు. పార్టీలో ఎవరికీ గౌరవం ఉండేది కాదు. 

కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ని కలవాలంటే అపాయింట్మెంట్ లభించేది కాదు. ఒకవేళ లభించినా గంటల తరబడి ఎదురుచూసేలా చేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఎమ్మెల్యేకి పూర్తి స్వేచ్చ ఉంది. సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులను ఎవరైనా ఎప్పుడైనా నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడవచ్చు. 

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేసుకునేవారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు కానీ తమకు ఉపయోగపడుతారని అనుకునే కాంట్రాక్టర్లకు అవసరం లేని పనులకు వందలు, వేలకోట్ల రూపాయల విలువగల పనులు అప్పగించేవారు. కేటీఆర్‌ ఎవరెవరికి అవసరం లేని పనులకు వందల కోట్లు ముట్టజెప్పారో మాకు తెలుసు. ఆ జాబితా కూడా నా దగ్గర ఉంది. త్వరలోనే దానిని బయటపెడతాను.  

మేము కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి చేసి మా నియోజకవర్గాలలో చేయించుకున్న పనులకు కేసీఆర్‌ నిధులు విడుదల చేసేవారు కారు. చివరికి ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడి వారికి పెండింగ్ బిల్లులు చెల్లిస్తుండటంతో మళ్ళీ నియోజకవర్గాలలో పనులు మొదలవుతున్నాయి. 

ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోయినా కేసీఆర్‌, కేటీఆర్‌ అహంభావం ఇంకా తగ్గలేదు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. చివరికి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురే బిఆర్ఎస్ పార్టీలో మిగులుతారేమో?” అని దానం నాగేందర్‌ అన్నారు. 


Related Post